ఎస్సారెస్పీ వరద కాలువకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ నుంచి దిగువకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గిపోవడంతో ప్రధాన గేట్లను మూసినట్లు తెలిపారు. వరద కాలువ ద్వారా వదిలిన నీరు కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్టుకు చేరుతాయన్నారు. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎమ్‌డీ ప్రాజెక్టుకు విడుదల చేస్తారని తెలిపారు. ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం 10,320 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగిందన్నారు. దీంతో వరద కాలువకు 3వేలు, కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్కేప్ గేట్లకు నీటి విడుదలను నిలిపివేసినట్లు ఏఈఈ తెలిపారు. ప్రాజెక్టు నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 8,500 క్యూసెక్కుల నీరు పోతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉందన్నారు.